అమరావతి : దసరా సెలవుల కారణంగా అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఓ విద్యార్థిని పిడుగుపాటుకు ( Lightning) గురై మరణించిన విషాద ఘటన బాపట్ల(Bapatla) జిల్లా పాత చీరాల లో చోటు చేసుకుంది. ఫుడ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ కోర్సు చదువుకుంటున్న విద్యార్థిని తులసీ రెండురోజుల క్రితం అమ్మమ్మ గ్రామానికి వచ్చింది.
గురువారం తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో వర్షం పడుతుండడంతో ఆరేసిన దుస్తులు తెచ్చేందుకు తులసీ డాబా పైకి వెళ్లింది. అదే సమయంలో ఆమెపై పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.