PM Modi | ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ప్రధాని మోదీ (PM Modi) పర్యటించనున్నారు. గురువారం ఉదయం 11.45 గంటలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అధికారులు శ్రీశైలంలో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. ఆలయానికి వెళ్లే అన్ని దారుల్లో ట్రాఫిక్‌ను నిలిపివేయనున్నారు. ఇప్పటికే శ్రీశైల క్షేత్రం భద్రతావలయంలోకి వెళ్లింది. కాగా, శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న ఐదో ప్రధానికిగా మోదీ నిలువనున్నారు. గతంలో నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు ప్రధాని హోదాలో ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారు.
ప్రధాని మోదీ పర్యటన ఇలా..
ఉదయం 7.20 గంటలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రత్యేక ఐఏఎఫ్ ఎంబ్రార్ విమానంలో ప్రధాని మోదీ శ్రీశైలం బయలుదేరుతారు. 10.20 గంటలకు కర్నూలు (ఓర్వకల్లు) విమానాశ్రయానికి చేరుకుంటారు. 10.25 గంటలకు ఎంఐ-17 హెలికాప్టర్లో బయలుదేరి శ్రీశైలం సమీపంలో ఉన్న సున్నిపెంట హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 11.15 గంటలకు సున్నిపెంట నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం లోని భ్రమరాంబ అతిథి గృహానికి చేరుకుని, కొద్ది సేపు విరామం తీసుకుంటారు. 11.45 గంటలకు శ్రీశైలం ప్రధాన ఆలయానికి చేరుకుని భ్రమరాంబ, మల్లికార్జునస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. 1.35 గంటలకు సున్నిపెంట నుంచి హెలికాప్టర్లో కర్నూలుకు బయలుదేరతారు. బహిరంగ సభ అనంతరం సాయంత్రం 4.45 గంటలకు విమానంలో ఢిల్లీకి బయలుదేరతారు.