Tirupati | తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉద్రిక్త వాతావరణం తర్వాత జరిగిన ఎన్నికలో టీడీపీ అభ్యర్థి మునికృష్ణ డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. మునికృష్ణకు 26 మంది, వైసీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 21 మంది మద్దతు తెలిపారు. అయితే, టీడీపీ అభ్యర్థికి మద్దతు తెలిపిన ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు అనీశ్రాయల్, అమర్నాథ్ రెడ్డి, మోహన్ కృష్ణ యాదవ్.. ఎన్నిక తర్వాత మాజీ మంత్రి భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద కనిపించారు.
ఆ ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు కూడా భూమన కాళ్ల మీద పడి తప్పయ్యిందని ఒప్పుకున్నారు. తమను బెదిరించి కూటమి అభ్యర్థికి ఓటు వేయించుకున్నారని తెలిపారు. తాము ఎవరి నుంచి డబ్బులు తీసుకోలేదని.. కూటమి నేతలు తమను కొట్టి బెదిరించారని పేర్కొన్నారు.
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉండగా.. ప్రస్తుతం 47 మంది కార్పొరేటర్లు ఉన్నారు. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఎక్స్అఫిషియో సభ్యులుగా ఉన్నారు. మొత్తం 50 మంది సభ్యులకుగానూ సగం మంది హాజరుకావాల్సి ఉండగా.. ఎమ్మెల్యే అరణితో కలిసి 22 మందే హాజరుకావడంతో కోరం లేదని సోమవారం జరగాల్సిన ఎన్నికను వాయిదా వేశారు. ఇవాళ కోరం ఉండటంతో డిప్యూటీ మేయర్ ఎన్నికను పూర్తి చేశారు. ఇదిలా ఉండగా.. డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా సోమవారం నాడు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో కూటమి నాయకులు దౌర్జన్యాలకు పాల్పడే అవకాశం ఉందని వైసీపీ నాయకులు భద్రత కోసం కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కేంద్రం వద్ద అదనపు భద్రతను కూడా కల్పించారు.