తిరుపతి : తిరుపతి శ్రీ కోదండరామ ( Kodanda Ramaswamy ) స్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. దీంట్లో భాగంగా రెండో రోజు శుక్రవారం పవిత్ర సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది. స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు.
విష్వక్సేనారాధన, పుణ్యాహ వచనం, కుంభారాధన, ఉక్తహోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం ( Tirumanjanam ) వేడుకగా జరిగింది. ధ్రువమూర్తులు, కౌతుకమూర్తులు , స్నపనమూర్తులకు బలిమూర్తులకు పవిత్రాలు సమర్పించారు.
విష్వక్సేన, ద్వారపాలకులు , భాష్యకార్లు, గరుడాళ్వార్, యాగశాలలోని హోమగుండాలు , బలిపీఠం ధ్వజస్తంభం, ఆలయం ఎదురుగా గల ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో పార్థసారథి, వైఖానస ఆగమ సలహాదారు మోహనరంగాచార్యులు, కంకణభట్టార్ ఆనందకుమార దీక్షితులు తదితరులు పాల్గొన్నారు.