తిరుమల : తిరుపతిలో జరిగిన తొక్కిసలాట (Tirupati stampede) ఘటనపై న్యాయ విచారణ (Judicial inquiry) ప్రారంభమైంది. విచారణ అధికారి రిటైర్డ్ జడ్జి, జస్టిస్ సత్యనారాయణ మూర్తి ఆదివారం తిరుపతిలో పర్యటించారు. తొలిరోజు జిల్లా కలెక్టర్, ఎస్పీ హర్షవర్దన్ రాజా విచారణ ముందు హాజరై వివరాలు అందజేశారు. అనంతరం ఘటన జరిగిన పద్మావతి పార్కును రిటైర్డ్ జడ్జి సందర్శించారు. జరిగిన ఘటన వివరాలను, ప్రమాదానికి గల కారణాలను అక్కడి అధికారులతో క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.
ఆదివారం రెండో రోజు కలెక్టర్ కార్యాలయంలో టీటీడీ ఈవో శ్యామలరావు విచారణ అధికారి ముందు హాజరయ్యారు. రుయా, స్విమ్స్ వైద్యుల నుంచి నివేదికను తెప్పించుకుని పరిశీలించారు. జనవరి 10న వైకుంఠ ద్వారా దర్శనాల సందర్భంగా రెండు రోజుల ముందు నుంచి తిరుపతిలో దర్శనాల టోకెన్లను జారీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 8వ తేదీన జరిగిన తొక్కిసలాటలో 6గురు చనిపోగా 50 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.