Tirupati | భార్య వదిలేసి వెళ్లిపోవడంతో అందరూ తనను చూసి నవ్వుతున్నారనే అనుమానంతో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. తన ఇంటి సమీపంలో ఉన్న బాలుడితో ఘర్షణ పడటమే కాకుండా.. భార్య వదిలేసి వెళ్లిన కోపాన్ని అతనిపై చూపించాడు. తన దగ్గర ఉన్న కత్తితో బాలుడిని నరికి చంపాడు. ఏపీలోని తిరుపతి జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి జిల్లా రేణిగుంట సంత సమీపంలోని గువ్వల కాలనీకి చెందిన పూసలు అమ్ముకునే వ్యక్తిని అతని భార్య ఇటీవల వదిలేసి వెళ్లిపోయింది. దీంతో పూసలు అమ్ముకునే వ్యక్తి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఆ సమయంలో ఆ వ్యక్తిని చూసి అందరూ హేళనగా నవ్వుతున్నారని భావించేవాడు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన శ్రీహరి (17) కూడా తనను చూసి నవ్వాడని అనుకున్నాడు. ఆ బాలుడి మీద కోపం పెంచుకుని బుధవారం ఒంటరిగా ఉన్న బాలుడిపై చేయి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాలుడి తండ్రి.. పూసలు అమ్ముకునే వ్యక్తిని నిలదీశాడు. మరోసారి తన కొడుకును కొడితే చూస్తూ ఊరుకోనని వార్నింగ్ ఇచ్చాడు.
తండ్రి వెళ్లిపోయిన కాసేపటికే పూసలు అమ్ముకునే వ్యక్తికి, బాలుడికి మధ్య మళ్లీ ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన వ్యక్తి పూసల దారాలు కోసే పదునైన కత్తితో బాలుడి మెడపై నరికాడు. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గమనించిన స్థానికులు బాలుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ పరిస్థితి విషమించడంతో కన్నుమూశాడు.