అమరావతి: వైసీపీ ఐదేండ్ల పాలనలో అన్ని వ్యవస్థలను నాశనం చేసినట్లుగానే పవిత్రమైన తిరుమల (Tirumala) క్షేత్రాన్ని అపవ్రితం చేశారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు (CM Chandrababu) ఆరోపించారు. ఉండవల్లి నివాసంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. తిరుమల కొండపై ఉన్న నిబంధనలన్నీ పక్కనపెట్టి పాలన కొనసాగించారని దుయ్యబట్టారు.
తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని వైసీపీపై మండిపడ్డారు.టీటీడీ పాలక మండలి సభ్యుల నియామకాన్ని ఇష్టారీతిన జరిపారని, అనామకులకు అవకాశాలు కల్పించారని ఆరోపించారు. తిరుమల లడ్డూ వ్యవహారంలోనూ కల్తీ నెయ్యిని ఉపయోగించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్నారు. తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. తప్పులు చేసే వారిని స్వామివారు ఎప్పటికప్పుడు శిక్షలు వేస్తారని పేర్కొన్నారు.
ఇప్పటివరకూ పాలకులెవ్వరూ తిరుమల పవిత్రత దెబ్బతీసే సాహసం చేయలేదని వివరించారు. వైసీపీ ప్రభుత్వ తప్పులను సరిదిద్దుతూ వ్యవస్థలను చక్కబెడుతున్నామని చంద్రబాబు వెల్లడించారు. వైసీపీ నాయకులు నేరం చేయడం, తప్పించుకోడానికి ఎదురుదాడి చేయడం అలవాటుగా మారిందని విమర్శించారు. కూటమి అధికారం చేపట్టగానే తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెట్టామని, తిరుమలలో గోవింద నామస్మరణే వినపడాలనే సంకల్పంతో అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.