Tirumala | తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంలో కీలక విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏఆర్ డెయిరీ సంస్థ కల్తీ నెయ్యి పంపిందని రుజువు చేసేందుకు కావాల్సిన ఆధారాలు దొరికాయని తెలుస్తోంది. కమర్షియల్ ట్యాక్స్ అధికారుల నివేదికలో విషయం తెలిసిందని సమాచారం.
తిరుమలకు కావాల్సినంత నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ ఏఆర్ డెయిరీ సంస్థకు లేదని వచ్చిన అనుమానం నేపథ్యంలో కమర్షియల్ ట్యాక్ అధికారులు ఆ దిశగా విచారణ మొదలుపెట్టారు. దిండిగల్‌లోని ఏఆర్ డెయిరీ సంస్థ నెయ్యి ఎక్కడి నుంచి సేకరించింది? ఎంత ధరకు సేకరించింది? అనే కోణంలో దర్యాప్తు చేయగా సంచలన విషయాలు బయకొచ్చాయని సమాచారం. తిరుపతి జిల్లాలోని పునబాక వద్ద ఉన్న శ్రీ వైష్ణ వి డెయిరీ స్పెషాలిటీస్ లిమిటెడ్ నుంచి ఏఆర్ డెయిరీ సంస్థ నెయ్యి కొనుగోలు చేసి, టీటీడీకి పంపించిందని తెలిసింది. అలాగని ఆ నెయ్యి వైష్ణవి డెయిరీలో కూడా తయారు కాలేదు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ జిల్లాలో ఉన్న భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ నుంచి వైష్ణవి డెయిరీ నెయ్యి కొనుగోలు చేసింది. ఆ నెయ్యిని ఏఆర్ డెయిరీకి పంపించగా.. ఆ సంస్థ తిరుమలకు పంపించిందని తమ నివేదికలో కమర్షియల్ ట్యాక్స్ అధికారులు పేర్కొన్నారు.
మొత్తం 5 ట్యాంకర్ల ద్వారా 8 ట్రిప్పుల నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేశారు. ఒక ట్యాంకర్ మాత్రం 3 ట్రిప్పుల నెయ్యిని ఏఆర్ డెయిరీకి తీసుకెళ్లకుండానే డైరెక్ట్‌గా తిరుమలకు పంపించారు. మరో 4 ట్యాంకర్లు పునబాక నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణించి దిండిగల్‌లోని ఏఆర్ డెయిరీ వెళ్లాయి. అక్కడి నుంచి మళ్లీ తిరుమలకు వచ్చాయి. ఏ ట్యాంకర్ ఏ మార్గంలో వెళ్లింది? ఎన్ని టోల్ ప్లాజాలు దాటిందనే వివరాలు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ, వైష్ణవి డెయిరీ నుంచి ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో ఎంత మొత్తం నెయ్యి కొనుగోలు చేసిందో ఇన్వాయిస్ నంబర్లు, ఈ వే బిల్లులతో సహా వెల్లడించింది.
రికార్డుల్లో మాత్రమే భోలే బాబా డెయిరీ నుంచి వైష్ణవి డెయిరీ, అక్కడి నుంచి ఏఆర్ డెయిరీ కొనుగోలు చేసినట్లుగా చూపించారని.. వాస్తవానికి ఆ రెండు డెయిరీలు కలిసే దందాను నడిపించాయని తెలుస్తోంది. విపిన్ జైన్, పొమిల్ జైన్‌లే అనే ఇద్దరు భోలేబాబా, వైష్ణవి డెయిరీ రెండింటిలోనూ డైరెక్టర్లుగా ఉన్నట్లు అధికారుల ఎంక్వైరీలో తెలిసింది. దీంతో దీని వెనుక పెద్ద కథ నడిచి ఉంటుందని అనుమానిస్తున్నారు. డెయిరీ నుంచి కొనుగోలు చేసిన ధరల్లో ఉన్న వ్యత్యాసమే ఇందుకు మరో కారణం.
భోలే బాబా డెయిరీ నుంచి కిలో నెయ్యి రూ.355 చొప్పున వైష్ణవి డెయిరీ కొనుగోలు చేసింది. అదే నెయ్యిని ఏఆర్ డెయిరీకి రూ.318.57కి సరఫరా చేసింది. ఏఆర్ డెయిరీ టీటీడీకి రూ.319.80కి అందజేసింది. అంటే వైష్ణవి డెయిరీ ప్రతి కిలోకు రూ.36.43 నష్టాన్ని భరించి ఏఆర్ డెయిరీకి విక్రయించినట్లు తెలుస్తోంది. ఇందులో ట్రాన్స్‌పోర్టు ఖర్చులు అదనం. దీంతో అంత నష్టాన్ని భరిస్తూ నెయ్యి ఎందుకు సరఫరా చేస్తుందనే అనుమానాలు వస్తున్నాయి. కచ్చితంగా కల్తీ చేయడం వల్లే అంత తక్కువకు ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు. దీంతో తాను కొనుగోలు చేసిన ధర కంటే తక్కువకు ఎలా నెయ్యిని సరఫరా చేసిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.