Liquor Income | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh) మద్యం దుకాణాలకు పిలిచిన దరఖాస్తుల ద్వారా బుధవారం సాయంత్రం వరకు 50 వేలకు పైగా దరఖాస్తుల వచ్చాయని ఆబ్కారీశాఖ ముఖ్యకార్యదర్శి ఎంకె మీనా(MK Meena) వెల్లడించారు. దీని వల్ల నాన్ రిఫండబుల్ రుసుముల రూపంలో ప్రభుత్వానికి రూ. వెయ్యి కోట్ల ఆదాయం సమకూరిందని వివరించారు.
మద్యం దుకాణాల(Liquor Shops) లైసెన్సులకు దరఖాస్తుల స్వీకరణ గడువు నేటితో ముగియగా దానిని ఈనెల 11 వరకు పొడిగించామన్నారు. 14వ తేదీన కలెక్టర్ల పర్యవేక్షణలో మద్యం షాపులకు లాటరీ(Lottery) తీస్తారని వెల్లడించారు. ఈనెల 16 నుంచి ప్రైవేట్ మద్యం దుకాణాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 3,396 దుకాణాలకు లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ ఇచ్చింది.
ఒక్కో షాపును రూ.2లక్షలు చొప్పున నాన్ రిఫండబుల్ రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే ప్రాంత జనాభాను బట్టి మొత్తం నాలుగు శ్లాబుల్లో లైసెన్సు రుసుములు ఖరారు చేశారు. తొలి ఏడాది పది వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 50 లక్షలు, ఐదు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 85 లక్షలుగా లైసెన్సు రుసుమును నిర్ణయించిందని, రెండో ఏడాది ఈ రుసుములపై పదిశాతం చొప్పున పెంచి వసూలు చేయడం జరుగుతుందని వివరించారు.