Devaragattu | అమరావతి : కర్నూల్ జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో ప్రారంభమైన బన్ని జైత్రయాత్రలో హింస చెలరేగింది. యాత్రలో భాగంగా దేవతామూర్తులను రక్షించుకునేందుకు మూడు గ్రామాల భక్తులు ఒక వైపు, మరో 7 గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడ్డారు. ఈ సమరంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన వారిందరిని ఆదోని ఆస్పత్రికి తరలించారు. దేవరగట్టులో పోలీసులు భారీగా మోహరించారు. జిల్లా ఎస్పీ విక్రాంత పాటిల్, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, పత్తికొండ ఆర్డీవో భరత్ నాయక్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
దేవరగట్టులో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండపై వెలసిన మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్వామి దేవతామూర్తులను కాపాడుకోవడానికి నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఒకవైపు, అరికెర, అరికెర తండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం భక్తులు మరోవైపు కర్రలతో తలపడుతారు. ఈ క్రమంలో జరిగే దైవ కార్యంలో పదుల సంఖ్యలో భక్తులు గాయపడడం పరిపాటిగా మారింది.