Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కొండపై మంగళవారం మూడు హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. తిరుమల నో ఫ్లయింగ్ జోన్‌గా ఉండగా.. ఆలయం పరిసరాల మీదుగా హెలికాప్టర్లు ఎగరడం తీవ్ర కలకలం సృష్టించింది. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పరకామణి భవనం, బాలాజీనగర్ ఉపరితలంపై నుంచి హెలికాప్టర్లు చక్కర్లు కొట్టినట్లు సమాచారం. ఎన్నడూ లేనివిధంగా తిరుమల కొండపై హెలికాప్లర్లు ఎగరడంపై భక్తులు విస్మయం చెందారు.
అయితే, ఈ ఘటనతో అప్రమత్తమైన తిరుమల తిరుపతి దేవస్థానం హెలికాప్టర్ల గురించిన వివరాలు ఆరా తీస్తున్నారు. అయితే, హెలికాప్టర్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందినవిగా భావిస్తున్నారు. కడప నుంచి చెన్నైకి హెలికాప్టర్లు తిరుమల మీదుగా వెళ్లినట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కొద్ది నెలల కిందట తిరుమలలో డ్రోన్ సంచారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.