అమరావతి : ఏపీ రాజధాని అమరావతిపై తప్పుడు ప్రచారం చేసే వైసీపీ (YCP) నాయకులను సంఘ బహిష్కరణ చేయాలని సీఎం చంద్రబాబు (Chandrababu) ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం విజయవాడలో వరద ప్రభావ ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వం చేపడుతున్న, చేపట్టబోయే సహాయ కార్యక్రమాలను వివరిస్తూ అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని తీవ్రంగా హెచ్చరించారు.
భారీ వర్షాలు, బుడమేరు వాగుకు గండ్లు పడడంతో విజయవాడకు వరద ముంచెత్తిందని పేర్కొన్నారు. తన ఇంటిని కాపాడుకోవడానికి కరకట్ట నిర్మించారని వైసీపీ చేసిన ఆరోపణలపై మండిపడ్డారు. విపత్తు సమయంలో బాధితులకు అండగా నిలబడాల్సింది పోయి వారిలో ఆత్మస్థైర్యం కోల్పోయ్యేలా మాట్లాడడం రాక్షసత్వానికి నిదర్శనమని అన్నారు. మళ్లీ వర్షాలు వచ్చి బుడమేరుకు మళ్లీ వరద వచ్చే అవకాశముండడంతో తామంతా భయపడుతున్న సమయంలో దుర్మార్గంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. అమరావతి(Amaravati) ఎడారి అంటూ వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులను సంఘ బహిష్కరణ(Expell) చేయాలన్నారు.
రాజకీయ ముసుగులో దౌర్జన్యం..
సమాజహితం కోసం పనిచేయని పార్టీకి రాష్ట్రంలో ఉండే అర్హత లేదన్నారు. సినిమా యాక్టర్లు, పారిశ్రామిక వేత్తలు, సామాన్యులంతా వచ్చి సహాయ, సహకారాలు అందిస్తుంటే రాజకీయ ముసుగులో నేరస్తుల మాదిరిగా దౌర్జన్యం చేస్తున్నారని వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచకాలు కొనసాగవని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. బురద చల్లే కార్యక్రమాలను మానుకోవాలని సూచించారు.
సంక్షోభ సమయంలో అనవసర రాజకీయాలు చేయవద్దని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. కష్టాల్లో ఉన్న బాధితులకు అండగా నిలువకుండా రాక్షసంగా వ్యవహరించవద్దని అన్నారు. అమరావతిపై తప్పుగా మాట్లాడుతున్న వారు క్షమాపణ చెప్పేంత వరకు వదిలిపెట్టబోమని వివరించారు. ఏపీలో వరద సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, అధికారుల నిరంతర సహాయ చర్యల వల్ల బాధితులకు సహాయం అందుతుందని రేపటికల్లా ఇంకా మెరుగవుతుందని పేర్కొన్నారు.