Mithun Reddy| రాజమండ్రి సెంట్రల్ జైలులో తనను ఒక టెర్రరిస్ట్ మాదిరిగా ట్రీట్ చేశారని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరితో మాట్లాడనివ్వలేదని.. సీసీ కెమెరాలతో నిఘా పెట్టి.. విజయవాడ నుంచి మానిటరింగ్ చేశారని అన్నారు. అధికారులు కూడా తనతో మాట్లాడాలంటే భయపడే పరిస్థితి ఉండేదని.. తనతో ఏ అధికారి కూడా మాట్లాడలేదని పేర్కొన్నారు.
ఏపీ లిక్కర్ స్కాంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డి తాజాగా జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను అక్రమ కేసులతో అధైర్యపడలేదని అన్నారు. టీడీపీ ప్రభుత్వం తనపై తప్పుడు కేసులు పెట్టి వేధించిందని తెలిపారు. ఇలా అక్రమ కేసులు పెట్టి సాధించిందేంటని ప్రశ్నించారు. పైశాచిక ఆనందం తప్ప ఇందులో మరేమీ లేదని విమర్శించారు. నన్ను అరెస్టు చేసి నా తల్లిదండ్రులను మనోవేదనకు గురిచేశారని చెప్పారు. దాదాపు రెండు నెలలకు పైగా జైలులో పెట్టారని.. చివరకు కోర్టు బెయిల్ మంజూరు చేశారని అన్నారు. తనను ఎంత ఇబ్బంది పెట్టినా సరే అధైర్యపడే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు.
గతంలో 2014లోనూ తనపై కేసులు పెట్టి జైలులో పెట్టారని గుర్తుచేశారు. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా మమ్మల్ని వేధించడం మామూలే అని చెప్పారు. కష్టకాలంలో తనకు అండగా ఉన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఏమీ చేసినా వెనక్కి తగ్గేది లేదని తెలిపారు. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ముందుకువెళ్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేయాల్సిన పనులను పక్కనపెట్టి.. డైవర్షన్ చేయడంలో భాగంగా ఇలా అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఇక తాను బీజేపీలోకి వెళ్తున్నట్లు వస్తున్న ప్రచారాన్ని మిథున్ రెడ్డి ఖండించారు. ఇవన్నీ టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారమేనని కొట్టిపారేశారు.