అమరావతి : మతవిద్వేషాల ద్వారా బీజేపీ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందువుల పవిత్ర పండుగలను ఆసరాగా చేసుకుని దేశంలో సంఘ్ పరివార్ శక్తులు రెచ్చిపోతున్నాయని విమర్శించారు. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ మతవైషమ్యాలు పెంచుతున్నారని తెలిపారు.
బీజేపీ కుటిల నీతిపై ఇప్పటికే లౌకిక పార్టీలన్నీ ఏకమై ఆందోళన వ్యక్తం చేశాయని పేర్కొన్నారు. శ్రీరామ నవమి, హనుమజ్జయంతి ఉత్సవాలకు సంఘ్ పరివార్ శక్తులకు సాయుధులకు ఆయుధాలు ఇచ్చి మత ఘర్షణలు సృష్టించేందుకు పండుగలను వేదిక చేసుకుందని తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మత ఘర్షణలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సైతం బీజేపీ మతవిధ్వేషాలు పెంచుతుందని ఆయన ఆరోపించారు. ఏపీలో అన్ని పార్టీలు బీజేపీకి వంతపాడుతున్నాయని అన్నారు. టీడీపీ మౌనంగా ఉంటుందని , జనసేన బీజేపీకి అనుయయంగా తయారైందని ఆరోపించారు.