తిరుమల : తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేంకటేశ్వరాస్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు వస్తున్న భక్తులతో 31 కంపార్టుమెంట్లు (Compartments) నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 16-18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 83,538 మంది భక్తులు దర్శించుకోగా 30,267 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ. 4.25 ఆదాయం (Income) వచ్చిందన్నారు.
తిరుమలలో శాస్త్రోక్తంగా జీయంగార్ల చాతుర్మాస దీక్ష సంకల్పం
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగారి నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం జరిగింది. ఈ సందర్భంగా పెద్దజీయర్‌స్వామి (Peddajiyarswamy) మాట్లాడుతూ, వైష్ణవ సంప్రదాయకర్త రామానుజాచార్యుల పారంపర్యంలో చాతుర్మాస దీక్ష విశేషమైందన్నారు.
ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారని తెలిపారు. కావున ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారని, చాతుర్మాస వ్రతం ప్రాచీనకాలం నుండి ఆచరణలో ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోందని వివరించారు. శ్రీవారి ఆలయ మహద్వారం వద్ద టీటీడీ ఈవో జె.శ్యామల రావు, జేఈవో వీరబ్రహ్మం సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. జీయంగార్లు శ్రీవారిని దర్శించుకున్న తరువాత పెద్దజీయంగారికి మేల్చాట్ వస్త్రాన్ని, చిన్నజీయంగారికి ఉల్ చాట్ వస్త్రాన్ని బహూకరించారు.