తిరుమల : తిరుమల (Tirumala ) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం కోసం 24 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ(TTD) అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 77,995 మంది భక్తులు దర్శించుకోగా 30,250 వేల మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు స్వామివారికి సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.72 ఆదాయం(Hundi income) వచ్చిందని తెలిపారు.
ఈనెల 18 నుంచి కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు
తిరుపతి : తిరుపతి కపిలేశ్వరస్వామివారి ఆలయం (Kapileshwar Temple) లో జూలై 18 నుంచి 20వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం జూలై 17న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణను నిర్వహించనున్నారు.
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలను నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు . ఇందులో భాగంగా జూలై 18న మొదటిరోజు ఉదయం ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం, సాయంత్రం కలశపూజ, హోమం, పవిత్ర ప్రతిష్ఠను నిర్వహిస్తామని వివరించారు.
19న రెండో రోజు ఉదయం గ్రంథి పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాలపూజ, హోమం, 20న మహాపూర్ణాహుతి, కలశోధ్వాసన, పవిత్ర సమర్పణను ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటలకు పంచమూర్తులైన కపిలేశ్వరస్వామి, కామాక్షి అమ్మవారు, విఘ్నేశ్వరస్వామి, సుబ్రమణ్యస్వామి, చండికేశ్వరస్వామివార్లు పుర వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇస్తారని వెల్లడించారు.