అమరావతి : ప్రమాదవశాత్తు బోరుబావి ( Borewell) లో పడిన బాలిక ( Girl) ను గ్రామస్థులు వెంటనే స్పందించి కాపాడిన ఘటన ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం పెనుమత్సలో ఇంటి యజమాని ఇంటి ప్రహారి నిర్మాణం కోసం బోరుబావి తవ్వాడు. శనివారం ఇంటి యజమాని కుటుంబ సభ్యురాలు కొడాలి సింధు(12) ఆడుకుంటూ ఇంటి ముందర ఉన్న బోరుబావిలో పడిపోయింది.
కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో వెంటనే స్పందించిన గ్రామస్థులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు హుటాహుటినా జేసీబీని రప్పించి బోరుబావికి సమాంతరంగా గొయ్యిని తవ్వారు. కొద్ది సేపట్లోనే బాలిక ఉన్న స్థలం వరకు గోతిని తవ్వి ఆమెను సురక్షితంగా కాపాడడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చు కున్నారు. అనంతరం బాలిక సింధును ఉయ్యూరు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.