TTD | హైదరాబాద్ : తిరుమల శ్రీవారిని ప్రతి రోజు వేలాది మంది భక్తులు దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ సందర్భంగా ఏడు కొండల వాడికి భక్తులు కానుకలు, విరాళాలను సమర్పిస్తుంటారు. కొంతమంది భక్తులు బంగారంతో పాటు విలువైన వస్తువులను స్వామి వారికి సమర్పిస్తుంటారు. ఈ క్రమంలోనే టీటీడీకి మరో భారీ విరాళం వచ్చింది.
హెచ్సీఎల్ టెక్నాలజీస్ చైర్ పర్సన్ రోషణి నాడర్ టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.2 కోట్లు విరాళం అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం డీడీని అందజేశారు. ఈ సందర్భంగా దాత రోషణి నాడర్ను టీటీడీ ఛైర్మన్ అభినందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బర్డ్ ట్రస్ట్ ద్వారా పేదలకు ఉచితంగా వైద్య సేవలు, శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు.. మిగిలిన రోగులకు నామమాత్రపు ఫీజులతో వైద్యం అందిస్తారు.