హైదరాబాద్/ విజయవాడ, మే 30 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఆంధ్రప్రదేశ్ సీఈవో ముకేశ్‌కుమార్ మీనా జారీచేసిన వివాదాస్పద మెమోను ఉపసంహరించుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ హైకోర్టుకు గురువారం తెలిపింది. మీనా జారీచేసిన మెమోకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉండగానే, ఆ మెమోను ఎన్నికల సంఘం వెనక్కి తీసుకోవడం గమనార్హం. దీనిపై గురువారం హైడ్రామా నడిచింది. వాస్తవానికి, పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం చేసి, స్టాంప్ లేకపోయినా.. తన పేరు, డిజిగ్నేషన్ పూర్తి వివరాలను చేతితో రాస్తే ఆమోదించాలని 2023 జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీచేసింది.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లోనూ ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి. కానీ, ఇందుకు భిన్నంగా ఏపీలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా ఈ నెల 25, 27 తేదీల్లో జారీచేసిన ఉత్తర్వులు రాజకీయ దుమారం సృష్టించాయి. ఈ ఉత్తర్వులపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు వైఎస్సార్సీపీ నాయకుడు ఎస్ నిరంజన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఏపీ సీఈవో మీనా జారీ చేసిన ఉత్తర్వులను తక్షణం సమీక్షించి, సముచిత నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ దాఖలు చేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌పై హైకోర్టు గురువారం అత్యవసరంగా విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ తరపున సీనియర్ అడ్వొకేట్ పీ వీరారెడ్డి, న్యాయవాది వివేక్ చంద్రశేఖర్ వాదిస్తూ.. టీడీపీకి అనుకూలంగా ఏపీ సీఈవో మార్గదర్శకాలను సవరించారని కోర్టు దృష్టికి తెచ్చారు. దేశంలో ఎక్కడా లేని నిబంధనలు ఏపీలో అమలుచేస్తున్నారంటూ అభ్యంతరం వ్యక్తంచేశారు. 2023 జూలైలో జారీ చేసిన మార్గదర్శకాలను యథాతథంగా అమలు చేయాలని కోరారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని, ఆ అధికారి హోదా గురించి పెన్నుతో రాసినా అనుమతించాలంటూ సీఈవో జారీ చేసిన మెమోను రద్దు చేయాలని కోరారు. సంతకం ఉండి, పేరు, హోదా, సీలు లేకపోయినా పోస్టల్ బ్యాలెట్‌ను కౌంటింగ్ సమయంలో ఆమోదించడం ఈసీ నిబంధనలకు విరుద్ధమని చెప్పారు.
ఈసీ తరపున సీనియర్ అడ్వొకేట్ అవినాశ్ దేశాయ్ వాదిస్తూ.. ఈ నెల 25న జారీ చేసిన మెమోలోని రెండో పేరాను రద్దుచేస్తున్నట్టు తెలిపారు. ఈ పేరాకు అనుగుణంగా ఈ నెల 27న జారీ చేసిన మెమోను కూడా పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు. ఈ దశలో తదుపరి విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. ఆ తరువాత కొద్దిసేపటికి వైసీపీ సీనియర్ లాయర్ వీరారెడ్డి తిరిగి కోర్టులోకి వచ్చి, ఈసీ తాజాగా జారీచేసిన ఉత్తర్వులను కూడా సవాల్ చేస్తూ సవరణ పిటిషన్ దాఖలు చేసినట్టు చెప్పారు. దీనిపై గురువారం రాత్రి 9 గంటలు దాటిన తరువాత డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. సవరణ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది. ఇదే సమయంలో వైసీపీ ప్రధాన పిటిషన్లో టీడీపీ దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతించే విషయంపై కూడా బెంచ్ చర్చించింది. వైసీపీ సవరణ పిటిషన్‌కు అనుగుణంగా ఇంప్లీడ్ పిటిషన్లో కూడా సవరణలు చేయాలని టీడీపీని ఆదేశించింది. అన్ని వ్యాజ్యాలపై శుక్రవారం విచారణ జరిపేందుకు నిరాకరించింది. దీనిపై సీజే నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నది. అవసరమైతే హౌస్‌మోషన్ విచారణ కోరవచ్చునని సూచించింది.