అలంపూర్/అలంపూర్ చౌరస్తా, అక్టోబర్ 24: బస్సు ప్రమాద స్థలాన్ని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. అనంతరం కర్నూల్ పోలీస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం చోటుచేసుకోవడం దురదృష్టకరమని, ప్రమాదం అందరి హృదయాలను కలిచి వేసిందని చెప్పారు. ప్రమాద మృతుల్లో ఏపీకి చెందిన వారు ఆరుగురు, తెలంగాణ చెందిన వారు ఆరుగురు, ఒడిశాకు చెందిన ఒకరు, బీహార్‌కు చెందిన ఒకరు, కర్నాటకకు చెందిన ఇద్దరు, తమిళనాడుకు చెందిన ఇద్దరు ఉండగా.. మరొకరిని గుర్తించాల్సి ఉన్నదని తెలిపారు.
ప్రమాదంపై విచారణ జరిపేందుకు, మృతదేహాలను గుర్తించేందుకు ఫోరెన్సిక్ బృందాలను రంగంలోకి దింపినట్టు చె ప్పారు. ప్రమాదానికి బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇద్దరు డ్రైవర్లలో ఒక డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నాడని వెల్లడించారు. తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు బస్సు ప్రమా దం జరిగిన ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు.