తిరుపతి : తిరుపతిలో (Tirupati) తొక్కిసలాట మృతులకు రూ. 25 లక్షల పరిహారం ( Compensation ) అందించనున్నట్లు ఏపీ ప్రభుత్వం (AP government ) ప్రకటించింది. తొక్కిసలాటలో ఆరుగురు చనిపోగా 48 మంది గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి చెందిన మంత్రులు మృతుల కుటుంబ సభ్యులను, ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
అనంతరం ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ( Minister Anita) , మంత్రి సత్యగాని ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ తిరుపతి ఘటన ప్రమాదమా.. కుట్రా అనే కోణంలో విచారణ చేపడుతామని వెల్లడించారు. ఎవరి వైఫల్యం ఉందో అనేది సీసీ కెమెరాల ద్వారా తెలుస్తుందని అన్నారు.
బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరుగకుండా చూస్తామని పేర్కొన్నారు. మంత్రి నిమ్మల రామోహ్మన్నాయుడు మాట్లాడుతూ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడుతామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని ప్రకటించారు.