అమరావతి : జంగారెడ్డిగూడెంలో సారా మరణాలపై జ్యుడిషియాల్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు తలపెట్టిన ర్యాలీ ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఎక్సైజ్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసేందుకు ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లిన టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేయడంతో ఇరువురు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రసాదంపాడు ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి బస్‌లో చేరుకున్న టీడీపీ ఎమ్మెల్యేలను ముందుగా పోలీసులు అడ్డుకోవడంతో కాలినడకన కమిషనర్ కార్యాలయానికి బయలు దేరారు.
దారిపోడవున కల్తీ సారా మరణాలను సహజ మరణాలని వ్యాఖ్యనించిన ఏపీ సీఎం జగన్ వెంటనే రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. సభను తప్పుదోవ పట్టిస్తున్న జగన్‌ను అధికారంలోకి తొలగించాలని డిమాండ్ చేశారు. కల్తీ మద్యంతో అనేక మంది మహిళల తాళీబొట్లు తెగిపోతున్నాయని నిమ్మల రామానాయుడు వినూత్న నిరసన తెలిపారు. చేతిలో మద్యం సీసా , తాళీబొట్టు పట్టుకుని ఎక్సైజ్ కార్యాలయం వరకు ఊరేగింపులో పాల్గొన్నారు.
న్యాయమైన డిమాండ్ల కోసం అసెంబ్లీలో ప్రశ్నించే 16 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దారుణమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వినతి పత్రం అందించేందుకు వెళ్తే పోలీసులు అడ్డుకోవడం విచారకరమని అన్నారు.