High Court | తెలంగాణ హైకోర్టులో వాన్‌పిక్ కంపెనీకి ఎదురుదెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ చార్జ్‌షీట్ నుంచి తమ సంస్థ పేరును తొలగించాలని వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
వాన్‌పిక్ ఓడరేవుకు భూ కేటాయింపుల్లో అక్రమాలు, క్విడ్‌ప్రోకో జరిగిందంటూ గతంలో సీబీఐ అధికారులు అభియోగాలు మోపారు. వాన్‌పిక్ ప్రాజెక్టు ప్రైవేటు లిమిటెడ్ పేరుతో భూసేకరణ జరిగిందని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. అయితే తమ పేరును సీబీఐ చార్జ్‌షీట్ నుంచి క్వాష్ చేయాలని 2022 జూలైలో వాన్‌పిక్ కంపెనీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణకు హైకోర్టు అనుమతించింది.
అయితే ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సీబీఐ సవాలు చేసింది. సీబీఐ వాదనలు పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. వాన్‌పిక్ పిటిషన్‌పై మరోసారి విచారణ జరపాలని హైకోర్టును ఆదేశించింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం వాన్‌పిక్ ప్రాజెక్టుపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా వాదనలు విన్న హైకోర్టు.. వాన్‌పిక్ పిటిషన్‌ను కొట్టివేసింది.