Tragedy | కొత్త బైక్ కొనివ్వకపోతే కొడుకు ఏ అఘాయిత్యానికి పాల్పడతాడోనని భయపడి కొత్త బైక్ కొనిస్తే.. ఆ తల్లిదండ్రులకు కడుపు కోతనే మిగిల్చాడు. అలిగి.. మొండిపట్టు పట్టడంతో మూడు లక్షలు అప్పు చేసి మరీ తండ్రి బైక్ కొనిస్తే.. మితిమీరిన వేగంతో బైక్ నడిపి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడి దుర్మరణం చెందాడు. ఏపీలోని విశాఖపట్నంలో ఈ విషాద ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం మహారాణిపేటలో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని కుమారుడు హరీశ్ (19) ఇంటర్ వరకు చదివాడు. ప్రస్తుతం ఖాళీగా ఇంటి దగ్గరే ఉంటున్న హరీశ్.. కొద్దిరోజుల నుంచి బైక్ కొనివ్వాలని అడుగుతున్నాడు. బైక్ కొనేంత స్థోమత లేదని తండ్రి చెప్పినప్పటికీ హరీశ్ వినిపించుకోలేదు. తల్లిదండ్రుల మీద అలిగి.. మొండిపట్టు పట్టాడు. దీంతో చేసేదేమీ లేక.. మూడు లక్షల రూపాయలు అప్పు చేసి మరీ దసరా రోజున శ్రీనివాసరావు బైక్ కొనిచ్చాడు.
ఆదివారం అర్ధరాత్రి సమయంలో టిఫిన్ చేయడానికి తన స్నేహితుడు వినయ్‌తో కలిసి హరీశ్ కొత్త బైక్‌పై ద్వారకానగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు వెళ్లాడు. టిఫిన్ తిన్నాక వినయ్‌ను ఇంటి వద్ద డ్రాప్ చేసేందుకు బయల్దేరాడు. ఈ క్రమంలో హరీశ్ మితిమీరిన వేగంతో బైక్‌ను నడపడంతో సిరిపురం దత్ ఐలాండ్ టర్నింగ్ వద్ద బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో హరీశ్‌కు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం హరీశ్ ప్రాణాలు కోల్పోయాడు. ఇక బైక్ వెనుకాల కూర్చున్న వినయ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.