AP News | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి జగన్ మానసిక పరిస్థితి బాగోలేదని విమర్శించారు. అందుకే ప్రెస్మీట్లో వింతవింతగా ప్రవరిస్తున్నారని అన్నారు. జగన్‌ను వెంటనే లండన్‌కు పంపించి, అక్కడి మెంటల్ ఆస్పత్రిలో చికిత్స అందించాలని అన్నారు. ఆ ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని సీఎం చంద్రబాబును కోరుతున్నానంటూ ఎద్దేవా చేశారు. జగన్‌కు బదులు భారతీరెడ్డిని వైసీపీ శాశ్వత అధ్యక్షురాలిగా నియమించాలని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు.
అసెంబ్లీ సమావేశాలకు జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంపైనా ఆనం వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 39.37 శాతం ఓట్లు వచ్చాయని తెలిపారు. వైసీపీకి 1,32,89,134 మంది ఓటు వేశారని.. వాళ్ల వాణి అసెంబ్లీలో వినిపించే బాధ్యత లేదా అని నిలదీశారు. జగన్‌ను మినహాయిస్తే మిగిలిన 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు 8,93,333 ఓట్లు వచ్చాయని.. మరి వాళ్ల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే వాటిని నిలదీయడం, సలహాలు సూచనలు చేయాల్సిన అవసరం లేదా అని అడిగారు.
అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలు ఫ్రీగా జీతాలు ఎందుకు తీసుకుంటున్నారని ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి, ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు నిజంగా మగాళ్లయితే మాకు జీతాలు, గన్మ్యాన్లు, ఇతర సదుపాయాలు ఏమీ వద్దని స్పీకర్‌కు లేఖ రాయాలని అన్నారు.