తిరుపతి : వేంకటేశ్వర స్వామి పరమ భక్తుడైన తాళ్లపాక అన్నమాచార్యుల (Tallapaka Annamayya ) 618వ జయంతి ఉత్సవాలు శనివారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, స్థానిక కళాకారులు కలిసి ఆలపించిన సప్తగిరి సంకీర్తనల గోష్టిగానం భక్తులను భక్తిరసంలో ముంచెత్తింది.

‘ బ్రహ్మకడిగిన పాదము’, ‘ కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు’ , ‘ నారాయణ తే నమో నమో’, ‘ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన ’ , ‘ హరి అవతారమితడు అన్నమయ్య ’ వంటి కీర్తనలతో ఎంతగానో ఆకట్టుకున్నాయి . ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ మేడసాని మోహన్, సంచాలకులు డాక్టర్ లత, కళాకారులు, భక్తులు పాల్గొన్నారు.