Srisailam | స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా క్షేత్ర పరిధిలో బుధవారం పారిశుధ్య స్వచ్ఛసేవా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముందుగా గంగాధర మండపం నుంచి నందిగుడి వరకు అవగాహన ర్యాలీ తీశారు. స్వచ్ఛ సేవ కార్యక్రమం సందర్భంగా క్షేత్రాన్ని ఆరు జోన్లు, 11 సెక్టార్లుగా, 66 ప్రాంతాలుగా విభజించారు. పారిశుధ్య కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రతీ జోనుకు దేవస్థానం యూనిట్ అధికారులను, పర్యవేక్షకులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఆయా జోన్లలో పలువురు సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు. దాదాపు అన్ని విభాగాల సిబ్బంది కూడా ఈ ప్రత్యేక విధులలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రధాన రహదారులతో పాటు మాడవీధులు, గంగాధర మండపం నుంచి తూర్పు వైపున నంది ఆలయం వరకు, దక్షిణం వైపున అలంకారేశ్వరయం వద్ద స్వచ్ఛసేవ కార్యక్రమం నిర్వహించారు.
దర్శనం క్యూకాంప్లెక్స్, విరాళాల సేకరణ కేంద్రం ప్రాంగణం, అన్ని ప్రసాద వితరణ భవనం పరిసరాలు, సీఆర్వో కార్యాలయం, దేవస్థానం వైద్యశాలతో పాటు గంగా, గౌరీ, మల్లికార్జున, గణేశసదన్ పరిసరాలను శుభ్రం చేశారు. టూరిస్ట్ బస్టాండ్ పరిసరాలు, సెంట్రల్ పార్కింగ్ ప్రదేశం, మల్లమ్మ కన్నీరు పరిసరాలు, పంచమఠాల పరిసరాలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్ర పరిసరాలు, సర్వతోభద్రవన పరిసరాలు, కల్యాణకట్ట పరిసరాలు, పాతాళగంగ పాతమెట్ల మార్గం, ఆర్టీసీ బస్టాండు, సిద్ధిరామప్ప వాణిజ్య సముదాయం, పాతాళగంగమెట్లమార్గం, పాతాళగంగ స్నానఘట్టాలు, భ్రమరాంబా అతిథిగృహ పరిసరాలు, సాక్షిగణపతి ఆలయ పరిసరాలు, హాటకేశ్వరాలయ పరిసరాలు, పాలధార -పంచదార, శిఖరేశ్వర ఆలయ పరిసరాలు మొదలైన 66 చోట్ల పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం సిబ్బందితో పాటు పలువురు శివకేశవులు పాల్గొన్నారు.