అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక శిక్షను ఎదుర్కొంటున్న ఆరుగురు ఐఏఎస్ అధికారులకు హైకోర్టులో తాత్కాలికంగా ఊరట లభించింది . నెలకోసారి సంక్షేమ వసతిగృహంలో సామాజిక సేవ చేయాలని గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేయడంతో ఇటీవల ఆరుగురు ఒక్కో హాస్టల్లో సేవలందించారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్‌లో అప్పిల్ చేసుకోగా ఇవాళ ఆరుగురు ఐఏఎస్‌లకు విధించిన సామాజిక శిక్ష 8 వారాల పాటు నిలిపివేస్తు హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును ఇచ్చింది.
గతంలో ప్రభుత్వ పాఠశాలల స్థలంలో గ్రామ సచివాలయాల ఏర్పాటు, కేబీకే కేంద్రాల ఏర్పాటు చేయవద్దని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను దిక్కరించిన 8 మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష ఖరారు చేసింది. అయితే వారి విజ్ఞాపనను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకున్న కోర్టు వారి శిక్షను తగ్గిస్తూ సామాజిక శిక్షను విధించింది. 10 నెలల పాటు సంక్షేమ వసతి గృహంలో ఒకరోజు సొంత ఖర్చులతో విద్యార్థులకు సేవలందించాలని ఆదేశాలు జారీ చేసింది.
8 మందిలో ఇప్పటికే అప్పీల్ చేసిన ఇద్దరు ఐఏఎస్‌లకు సామాజిక శిక్షను తాత్కాలిక నిలుపుదల చేయడంతో మిగత ఆరుగురు కూడా కోర్టుకు అప్పీలు చేసుకున్నందుకు ఇవాళ శిక్ష అమలు 8 వారాల పాటు నిలుపుదల చేసింది.