YS Viveka Murder Case | వైఎస్ వివేకా హత్య కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. అఫిడవిట్ దాఖలుకు సీబీఐ సమయం కోరడంతో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.
వైఎస్ వివేకా హత్య కేసులో కుట్ర కోణంపై తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని గత విచారణ సందర్భంగా సీబీఐని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనిపై తమ వాదనలు వినిపించేందుకు సిద్ధం కావాల్సి ఉందని.. దీనికోసం మరింత సమయం కావాలని సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు అత్యున్నత న్యాయస్థానానికి విన్నవించారు. అఫిడవిట్ దాఖలు చేసేందుకు మరింత గడువు కావాలని అభ్యర్థించారు.
సీబీఐ వినతిని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్ ధర్మాసనం.. తదుపరి విచారణనను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఈ రోజున మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపట్టనుంది.