Sajjala Bhargav Reddy | వైసీపీ సోషల్మీడియా ఇన్చార్జి సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆయన వేసిన పిటిషన్ను స్వీకరించేందుకు నిరాకరించింది. విజ్ఞప్తులు ఏవైనా ఉంటే హైకోర్టు ముందే చెప్పుకోవాలని స్పష్టం చేసింది.
సోషల్మీడియాలో అసభ్య పోస్టులు పెట్టారనే ఆరోపణలతో నమోదైన కేసుల్లో తనపై ఉన్న ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని సజ్జల భార్గవరెడ్డి ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం అత్యున్నత ధర్మస్థానం విచారణ చేపట్టింది. సజ్జల భార్గవరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, ఏపీ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. పాత విషయాలకు కొత్త చట్టాల ప్రకారం కేసులు పెడుతున్నారని కపిల్ సబల్ సుప్రీంకోర్టు ముందు విన్నవించారు. అయితే చట్టాలు ఎప్పటివి అనేది కాదని, మహిళలపై చేసిన అసభ్య వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోవాలని లూథ్రా వాదించారు. ఈ వ్యహారంలో భార్గవ రెడ్డినే కీలక సూత్రధారి అని చెప్పుకొచ్చారు.
ఇరువైపుల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. సజ్జల దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది. విజ్ఞప్తులు ఏవైనా ఉంటే ఏపీ హైకోర్టులోనే విన్నవించుకోవాలని సూచించింది. ఇందుకోసం రెండు వారాల సమయం ఇచ్చింది. ఈలోపు సజ్జల భార్గవరెడ్డిని అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించింది. రెండు వారాల తర్వాత మధ్యంతర రక్షణను పొడిగించాలా? వద్దా అనే అంశంపై ఏపీ హైకోర్టునే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది.