Vanpic | వాన్‌పిక్ కంపెనీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ చార్జ్‌షీట్ నుంచి తమ సంస్థ పేరును తొలగించాలని వేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.
వాన్‌పిక్ ఓడరేవుకు భూ కేటాయింపుల్లో అక్రమాలు, క్విడ్‌ప్రోకో జరిగిందంటూ గతంలో సీబీఐ అధికారులు అభియోగాలు మోపారు. వాన్‌పిక్ ప్రాజెక్టు ప్రైవేటు లిమిటెడ్ పేరుతో భూసేకరణ జరిగిందని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. అయితే తమ పేరును సీబీఐ చార్జ్‌షీట్ నుంచి క్వాష్ చేయాలని 2022 జూలైలో వాన్‌పిక్ కంపెనీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ నమోదు చేసిన అభియోగాలను సీబీఐ స్పెషల్ కోర్టు పరిగణనలోకి తీసుకుంది.. దానికి గల కారణాలను చెప్పలేదంటూ వాన్‌పిక్ యాజమాన్యం ఆ పిటిషన్లో పేర్కొంది. ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో వాన్‌పిక్ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్‌పై తాజాగా జస్టిస్ సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై విచారణకు నిరాకరిస్తూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.