అమరావతి : ప్రజలకు మంచి చేసే వ్యక్తులను, చెడు చేసే నాయకులను ఎప్పుడూ గుర్తించుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandra Babu) రాష్ట్ర ప్రజలను కోరారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రం తిరోగమనంలో పయనించిందని ఆరోపించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు (Potti Sriramulu) ఆత్మార్పణ దినం సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
స్ఫూర్తినిచ్చిన నాయకులను గుర్తుపెట్టుకుంటూనే 2014-19లో టీడీపీ (TDP) అందించిన పాలనను గుర్తించుకోవాలని సూచించారు. 2019-24వరకు ఉన్న వైసీపీ అన్ని రంగాలను నిర్వీర్యం చేయడంతో పాటు టీడీపీ చేపట్టిన అభివృద్ధిని ప్రభుత్వం పక్కనపెట్టిందని విమర్శించారు. అమరావతిని, పోలవరాన్ని (Polavarm) వైసీపీ నాశనం చేసిందని పేర్కొన్నారు.
2019లో వైఎస్ జగన్(YS Jagan) ప్రజల నెత్తిన చెయ్యిపెట్టి, ఆస్తులే రాయించుకునే పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు. గత ఐదేళ్లు రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛను కోల్పోయారని వెల్లడించారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ సమాజమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కేంద్రంలో ఏపీ పరపతి పెరిగింది కాబట్టి అప్పుడప్పుడు ఆర్థికంగా సహాయం చేస్తూ ఆక్సిజన్ అందిస్తున్నారని వివరించారు. ఆ సహాయం కూడా లేకపోతే అనేక ఇబ్బందులు వచ్చేవని అన్నారు.
ఇంకా పేదవానికి ఏవిధంగా న్యాయం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. త్యాగాలు చేసిన నాయకులను చూసినప్పుడు ఇబ్బందులు అధిగమించడం కష్టం కాదని అన్నారు. దేశాన్ని ఐకమత్యంగా ఉంచడం కోసం పోరాడిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, సంకల్ప సిద్ధి కోసం ప్రాణత్యాగం చేసిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.