Srisailam Temple | శ్రీశైలం : ప్రముఖ క్షేత్రమైన శ్రీశైలంలో అమావాస్య సందర్భంగా బయలు వీరభద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్ర పాలకుడైన వీరభద్రుడికి ప్రతి మంగళ, అమావాస్య రోజుల్లో దేవస్థానంలో విశేష అర్చనలు నిర్వహిస్తూ వస్తున్నది. సోమవారం అమావాస్య సందర్భంగా పరోక్షసేవ ద్వారా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు కేరళ, పశ్చిమ బెంగాల్ తదితర ప్రదేశాలకు చెందిన 24 మంది భక్తులు విశేష పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలని మొదట మహా గణపతిపూజ నిర్వహించారు. పంచామృతాలు, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధ జలాలతో వీరభద్రస్వామివారికి అభిషేకం చేశారు. స్వామివారి ఆరాధనతో గ్రహదోషాలు నివారణ అవుతాయని.. అరిష్టాలు తొలగిపోతాయని, సర్వకార్యానుకూలత కలిగి.. అభీష్టాలు సిద్ధిస్తాయని పండితులు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న భక్తులు 83339 01351 / 52 / 53 నంబర్లలో సంద్రించాలని దేవస్థాన అధికారులు కోరారు. పూజ కార్యక్రమాలను శ్రీశైలం దేవస్థానానికి చెందిన యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.