Srisailam | చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత శ్రీశైలం ఆలయాన్ని మూసివేశారు. చంద్ర గ్రహణం ఇవాళ రాత్రి 9.56 గంటలకు ప్రారంభమై రాత్రి 1.26 గంటలకు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం వరకు భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించారు. స్పర్శ దర్శనం పూర్తిగా నిలిపివేశారు.
శ్రీశైలం ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలు, పరోక్ష సేవలు, శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం పూర్తిగా నిలిపివేశారు. సాక్షి గణపతి, హారకేశ్వరం, పాలధార పంచధార, శిఖరేశ్వరం మొదలైన పరివార ఆలయాల ద్వారాలను కూడా మూసివేశారు. రేపు అనగా సోమవారం ఉదయం 5 గంటలకు ఆలయ ద్వారాలను తెరచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ జరిపించిన తర్వాత శ్రీస్వామి అమ్మవార్లకు ప్రాతఃకాల పూజలు జరిపిస్తారు. ఉదయం 7.30 గంటల నుంచి స్వామి అమ్మవార్లకు మహా మంగళహారతులను జరిపిస్తారు. మహా మంగళహారతుల సమయం నుంచి అనగా, ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.15 గంటల వరకు భక్తులందరికీ అలంకార దర్శనం కల్పిస్తారు.
సెప్టెంబరు 8 వ తేదీ నాటికి ఆన్లైన్లో శ్రీస్వామివారి స్పర్శదర్శనం, విరామదర్శనం టికెట్లు పొందిన భక్తులకు మధ్యాహ్నం 2.15 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రీస్వామివారి స్పర్శదర్శనం కల్పిస్తారు. తిరిగి సాయంత్రం 5.30 గంటల నుంచి 9 గంటల వరకు అలంకార దర్శనాలు కొనసాగుతాయి. ఆన్లైన్ ద్వారా శ్రీస్వామివారి స్పర్శదర్శనం, విరామ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు రాత్రి 9 గంటల నుంచి స్పర్శ దర్శనాలు కల్పిస్తారు.
కాగా, ఆలయాన్ని మూసివేసిన కార్యక్రమంలో ఈవో ఎం.శ్రీనివాసరావు, శ్రీస్వామివారి ప్రధానార్చకులు శివప్రసాద్ స్వామి, పలువురు అర్చకస్వాములు, వేదపండితులు, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎం.హరిదాసు, స్వామివారి ఆలయ పర్యవేక్షకులు ఎం.రవికుమార్, అమ్మవారి ఆలయ పర్యవేక్షకులు జి.రవి, ముఖ్య భద్రతాధికారి బి.శ్రీనివాసరావు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.