Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడంతో బుధవారం క్షేత్రానికి వచ్చే దారులన్నీ కిక్కిరిసి పోయాయి. బ్రహ్మోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ర్టాల యాత్రికులతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాది రాష్ర్టాల నుంచి వచ్చిన భక్తులతో పురవీధులు కిటకిటలాడాయి. భక్తులు తెల్లవారుజామునే పుణ్యస్నానాలు చేసుకుని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాలకు బారులుదీరుతున్నారు.
భక్తుల రద్దీ దృష్ట్యా మూడు గంటల సమయం పడుతున్న అలంకార దర్శనాలకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా తగిన ఏర్పాట్లు చేశామని ఈవో తెలిపారు. ఆన్లైన్ ద్వారా టికెట్లు పొందిన వారికి, కాలినడకన శ్రీశైలం చేరుకునే యాత్రికులతోపాటు ఇరుముడి శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్ల ద్వారా దర్శనం కల్పిస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఆలయం తెరిచినప్పటి నుంచి మూసివేసే వరకు క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు మంచినీరు మజ్జిగ అల్పాహారాన్ని అందిస్తూ ఉదయం 10 గంటల నుంచి అన్నదాన మహాప్రసాదాన్ని అందుబాటులో ఉంచారు. అదే విధంగా కాలినడక శివస్వాములకు భక్తులకు మార్గమధ్యలో అన్నదానాలు మంచి నీటిని అందిస్తున్న స్వఛ్చంద సంస్థలకు దేవస్ధానం వారు వసతులు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.