Srisailam Temple | శ్రీశైలం : జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఇటీవల ప్రారంభించిన మల్లికార్జునస్వామివారి ఉచిత స్పర్శ దర్శనానికి అనూహ్య స్పందన లభిస్తుందని దేవస్థానం ఎం శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఉచిత స్పర్శ దర్శనం నేపథ్యంలో భక్తులతో సంభాషించి అభిప్రాయాలు సేకరించినట్లు చెప్పారు. భక్తులంతా ఉచిత స్పర్శ దర్శనంపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. గతంలో తరహాలో వారంలో నాలుగు రోజులు అంటే మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఉచిత స్పర్శ దర్శనం కల్పించనున్నట్లు వివరించారు. ఈ క్రమంలో ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య భక్తులకు సౌకర్యం ఏర్పాట్లు మెరుగుపరచడంతోనే సర్వదర్శనాలు పునః ప్రారంభించినట్లు చెప్పారు.
Srisailam Temple
మల్లికార్జునస్వామివారిని భక్తులు స్వయంగా స్పర్శించడం వలన ఎంతో ఆధ్యాత్మికానుభూతిని పొందుతారన్నారు. అందుకే ఈ ఉచిత స్పర్శదర్శన నిర్వహణ పకడ్బందీగా ఉండాలన్నారు. ఏ ఒక్క భక్తుడు కూడా ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఉండాలన్నారు. అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత దేవస్థానంపై ఉందన్నారు. ఉచిత స్పర్శ దర్శనం విధివిధానాలపై చర్చించారు. ఉచిత స్పర్శ దర్శనం భక్తులకు అసౌకర్యానికి గురవకుండా ఉండేందుకు ఆన్లైన్లో ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం స్పర్శదర్శనం టికెట్లు, ఆయా ఆర్జితసేవాటికెట్లను పొందినట్లుగా భక్తులు ఉచిత స్పర్శదర్శనం టికెట్లను రోజుకు వెయ్యి టోకెన్లు మాత్రమే srisailadevasthanam.org, aptemples.ap.gov.in అధికారిక వెబ్సైట్లలను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని చెప్పారు.
EO Srinivasa Rao
ప్రస్తుతం పరోక్ష సేవ విధానానికి అమలులో ఉన్నట్లుగానే ఉచిత టోకెన్లు సైతం భక్తులు ఒకరోజు ముందుగానే పొందాల్సి ఉంటుందన్నారు. మంగళవారం మధ్యాహ్నం స్పర్శ దర్శనం చేసుకోవాలనే భక్తులు ముందురోజు అనగా సోమవారం నిర్దిష్ట సమయంలోనే టికెట్లు పొందాల్సి ఉంటుందన్నారు. భక్తులు పేరు, చిరునామా, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. భక్తులు ఆన్లైన్ ద్వారా పొందిన టికెట్లను స్కానింగ్ చేసి, ఆధార్ గుర్తింపుతో పోల్చిన తర్వాతే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. కాగా మధ్యాహ్నవేళల తర్వాత ఆలయశుద్ధి, మంగళవాయిద్యాలు, సుసాంధ్యము, ప్రదోషకాల పూజలను నిర్వహించాల్సి ఉంటుందని.. అందుకే మధ్యాహ్నం 1.45గంటల నుంచి స్పర్శ దర్శనాలు కల్పించనున్నట్లు వివరించారు.