Srisailam | శ్రీశైలం : ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. వర్షం నేపథ్యంలో ఆలయం ఎదుటన గంగాధర మండపం చుట్టూ ఉత్సవం నిర్వహించారు. ఆరుద్రోత్సవంలో భాగంగా మంగళవారం వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు నిర్వహించారు. అనంతరం స్వర్ణరథోత్సవం కనుల పండువగా నిర్వహించారు. స్వర్ణరథోత్సవానికి ముందు అర్చకస్వాములు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. ఆ తర్వాత రథంపై కొలువుదీరిన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు చేశారు. ఆ తర్వాత రథత్సవం జరిపించారు. సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా రథోత్సవంలో పలు కళా బృందాల కోలాటం, డోలు వాయిద్యం మొదలైన జానపద కళారూపాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఈవో ఎం శ్రీనివాసరావుతో పాటు ఆలయ ఏఈవో ఎం హరిదాస్, అర్చకులు, పండితులు, భక్తులు పాల్గొన్నారు.
Srisailam Temple