Srisailam | శ్రీశైలం, ఫిబ్రవరి 28: శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 11 రోజుల నవవాహ్నిక దీక్షతో నిత్యం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అలంకారాలు భక్తులను కనువిందు చేస్తున్నాయి.
ఉత్సవాలలో భాగంగా 10వ రోజు శుక్రవారం ఉదయం చండీశ్వరస్వామికి షోడశోపచార క్రతువులు చేసిన అనంతరం ఈఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రుద్రహోమ పూర్ణాహుతి, కళశోద్వాసన, త్రిశూలస్నానం, మహదాశీర్వచన పూజాధికాలు జరిపించారు. ఆలయ పుష్కరిణిలో వైదిక శాస్త్రోక్త అవబృంద స్నానం చేయించిన తరువాత వసంతోత్సవాన్ని నిర్వహించారు.
మహాశివరాత్రి రోజున స్వామి అమ్మవార్లకు కళ్యాణం జరిపిన తరువాత సంప్రదాయం ప్రకారం పార్వతీదేవి అమ్మవారికి మెట్టెలు, నల్లపూసలు సమర్పించే నాగవల్లి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్ధప్రసాదాలు తీసుకున్నట్లు అర్చకులు చెప్పారు.
నిత్య కళ్యాణ మండపంలో సదస్యం జరిగిన తరువాత ఉత్సవం మొదటి రోజు దేవతాహ్వానానికి ఆవిష్కరించిన ధ్వజపట అవరోహణ కార్యక్రమం ఆద్యంతం కన్నులపండుగగా జరిగింది.