Srisailam | శ్రీశైల క్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులే కాకుండా ఉత్తర దక్షిణాది రాష్ట్రాల నుండి కుడా వేలాదిగా తరలి వస్తున్నారు. తెల్లవారు జాము నుండి స్వామి అమ్మవార్ల దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉండి అలంకార దర్శనాలు
చేసుకుంటున్నారని ఆలయ అధికారులు తెలిపారు.
అలాగే ముడుపులు చెల్లించేందుకు వస్తున్న శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి మాల విరమణ ఇరుముడి సమర్పణలు చేయిస్తున్నారు. శివదీక్షా శిబిరాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కూడా అర్చకులు దీక్షా విరమణ చేయిస్తున్నారు.
యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన వసతులను దుర్వినియోగ పరచకుండా ప్రతి ఒక్కరూ వినియోగించు కునేలా ఉంచాలని ఈఓ శ్రీనివాసరావు భక్తులను కోరారు.
బ్రహ్మోత్సవాలలో బాగంగా క్షేత్ర ప్రధాన ప్రాంతాలతోపాటు పాతాళగంగ వద్ద పుణ్యస్నానాల కోసం ఏర్పాటు చేసిన జల్లు స్నాన ఘట్టాలను, పార్కింగ్, ఉద్యానవనాలను ఈఓ శ్రీనివాసరావు పరిశీలించారు. కృష్ణానదిలో పుణ్యస్నానాలు నిలిపి వేసినా, యాత్రికుల శ్రేయస్సు దృష్ట్యా నది ఒడ్డున ప్రత్యేక శిక్షణ పొందిన గజీతగాళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అన్నదాన భవనంలో దేవస్థానం నిర్వహించే అల్పాహార, భోజన సదుపాయాలను ప్రతి ఒక్కరూ వినియోగించు కోవాలని ఈఓ శ్రీనివాసరావు కోరారు.