Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలి వస్తున్న యాత్రికులకు దేవస్థానం ఆధ్వర్యంలో చిత్తశుద్ధితో సేవలందించాలని ఈవో పెద్దిరాజు అన్నారు. అన్నదాన భవనంలో వండుతున్న వంటకాలలో తాజా కూరగాయలనే ఉపయోగించాలని సూచించారు. దేవస్థాన వైద్యశాల, క్యూలైన్లు, సీసీ కంట్రోలు రూమ్లను ఈవో పెద్దిరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులకు మంచినీరు, అల్పాహరం, వైద్యసేవల్లో ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సిబ్బందిని సూచించారు.
భక్తులకు ఉచిత బస్సులు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్బంగా భక్తుల సౌకర్యార్థం దేవస్థానం 10 ఉచిత బస్సులను ఏర్పాటు చేసింది. ఈ బస్సులు క్షేత్ర పరిధిలోని కైలాసద్వారం, హటకేశ్వరం, సాక్షిగణపతి, పాలధార పంచధార, టోల్గేట్, టూరిస్ట్ బస్టాండ్, గణేశ సదనం, పార్కింగ్ ప్రదేశాల నుంచి భక్తులకు అందుబాటులో ఉన్నట్లు చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి తెలిపారు.