Srisailam | శ్రీశైలం : శ్రీశైల క్షేత్రంలోని మూడు భవనాలు శిథిలావస్థకు చేరగా.. వాటిని తొలగించాలని అధికారులు నిర్ణయించారు. భ్రమరాంబ మల్లికార్జున క్షేత్రంలోని పెద్దసత్రం, పొన్నూరు పత్రం, శివసదనం భవనాలు చాలా సంవత్సరాల కిందట నిర్మించారు. మూడు భవనాలు దాదాపుగా శిథిలావస్థకు చేరాయి. ఆయా భవనాల నిర్దిష్ట ఆయుర్దాయ కాలపరిమితి ముగింపు దశకు చేరింది. ఈ భవనాలు ప్రస్తుతం నివాసయోగ్యం కాదని రహదారులు భవనాలు, పంచాయితీరాజ్ శాఖల సాంకేతిక నిపుణులు దేవస్థానానికి చెప్పింది. అయితే, ఈ భవనాల్లో నివాసాలను కొనసాగించడం క్షేమం కాదని భావించిన దేవస్థానం.. స్థానికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ భవనాల్లోని నివాసితులందరినీ ఖాళీ చేయించి.. తొలగింపజేయాలని నిర్ణయించారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే శిథిలావస్థకు చేరిన ఈ భవనాల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పెద్దసత్రం, పొన్నూరు సత్రం, శివసదనంలోని గదుల్లో నివాసం ఉంటున్న దేవస్థానం సిబ్బందికి, మిగతా వారందరికీ ఒకే మాసంలోగా నివాసాలను ఖాళీ చేయాలని లిఖితపూర్వకంగా నోటీసులు ఇస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మూడు భవనాల్లోని నివాసులందరు వాస్తవ పరిస్థితులను గ్రహించి.. ఎలాంటి అపార్థాలకు లోనవకుండా నివాసాలను ఖాళీ చేసి.. దేవస్థానానికి సహకరించాలని కోరారు.