Srisailam | శ్రీశైలం, జూలై 29: శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తులతో మర్యాదగా నడుచుకోవాలని సీఐ ప్రసాదరావు సూచించారు. యాత్రికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయకూడదన్నారు. శ్రీశైలంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీశైలంలోని జీప్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, యజమానులు సీఐ జి.ప్రసాదరావు కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఐ ప్రసాదరావు మాట్లాడుతూ.. డ్రైవర్ల దగ్గర వాహనాల RC, డ్రైవింగ్ లైసెన్స్, బీమా, ఫిట్నెస్ సర్టిఫికెట్, కాలుష్య ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. యాత్రికుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, తాగి వాహనాలు నడపకూడదని సూచించారు. ఓవర్ స్పీడ్ ఎక్కించరాదని.. డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వాడకూడదని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. యాత్రికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయవద్దని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా వాహన బీమా ప్రాముఖ్యతను సీఐ ప్రసాదరావు వివరించారు. అన్ని రికార్డులు సక్రమంగా ఉన్న వాహనదారులకు పోలీస్ నంబర్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆటో డ్రైవర్లు, యజమానుల డేటా బేస్ మెయింటైన్ చేస్తామని పేర్కొన్నారు.
శ్రీశైల ఆలయ ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జ్యోతిర్లింగం, శక్తిపీఠంగా ప్రసిద్ధిగాంచిన శ్రీశైలం క్షేత్రానికి దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారని తెలిపారు. వారితో మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా అసత్యాలను ఎవరైనా సోషల్‌మీడియాలో ప్రచారం తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా దేవస్థానం పరంగా క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ అయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.