Srisailam Temple | శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా ఎం శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఆలయ ఈవోగా బుధవారం ఆయనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను గురువారం ఆలయానికి చేరుకొని.. బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత దేవస్థానం అన్నప్రసాదవితరణ విభాగాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నప్రసాదవితరణ మందిరంలోని భోజనశాలలు, పాకశాల, కూరగాయలు నిల్వచేసే కోల్డ్ స్టోరేజ్ గది, అన్నప్రసాదాల నిల్వను పరిశీలించారు. ఈ సందర్భంగా అన్నప్రసాదాల వితరణలో వండుతున్న రోజువారి వంటలకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు. వండిన వంటకాలను సైతం పరిశీలించారు.
వంటకాలన్నింటిని రుచికరంగా తయారు చేయాలని పాకశాల సిబ్బందికి సూచించారు. ఈ విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. భక్తులతో మర్యాదపూర్వకంగా మెదలాలన్నారు. ముఖ్యంగా వంటశాలను, భోజనశాలను, అన్నదాన ప్రాంగణమంతా కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని చెప్పారు. అధికారులతో మాట్లాడుతూ అన్నప్రసాద వితరణలో రోజువారీగా ఉపయోగించే కూరగాయలన్నీ తాజాగా ఉండేలా చూడాలన్నారు. అనంతరం పలువురు భక్తులతో మాట్లాడి.. అన్న ప్రసాదం నాణ్యతపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే, కమాండ్ కంట్రోల్ సెంటర్ను పరిశీలించగా.. క్షేత్రపరిధిలో వివిధ చోట్ల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వివరాల వివరాలను ఇంజినీరింగ్ విభాగం అధికారులు వివరించారు.