Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో పర్యావరణ పచ్చదనంతో కూడిన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి తెలిపారు. క్షేత్ర పరిధిలోని వలయ రహదారులలో విస్తృతంగా వివిధ రకాల ఔషధ మొక్కలను నాటి శ్రీశైలాన్ని మరింత సుందరీకరించాలని ఈవో లవన్న అన్నారు.
వలయ రహదారులకు ఇరువైపుల, ఆరు బయలు ప్రదేశాలు, దేవస్థాన ఉద్యానవనాల్లో మరిన్ని మొక్కలు నాటి వాటి సంరక్షణకు దేవస్థానం అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నారు. ఆదివారం వలయ రహదారి ఇరువైపుల, గణేష సదనం సమీపంలో చైర్మన్ , ఈవోలతోపాటు ధర్మకర్తల మండలి సభ్యులు బిల్వం, కదంబం, రావి, మహాగని, ఆకాశ మల్లె తదితరులు మొక్కలు నాటారు.
ప్రతి ఉద్యానవనంతోపాటు వలయ రహదారికి ఇరువైపులా పూలు పండ్లతోపాటు నీడనిచ్చే మహా వృక్షాల మొక్కలు, ఔషధ సుగంధ మెక్కలను విరివిగా పెంచాలని ఈవో లవన్న చెప్పారు. పూలు, పండ్ల చెట్ల పెంపకానికి గోశాల వద్ద తయారు చేస్తున్న సేంద్రీయ ఎరువులను మాత్రమే వినియోగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ రామకృష్ణ, డీఈ నర్సింహారెడ్డి, పీఆర్వో శ్రీనివాస్, విశ్రాంత ఉద్యోగి ఈశ్వర్రెడ్డి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.