Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో గురువారం లోక కల్యాణం కోసం ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం కింద గల శ్రీ దత్తాత్రేయ స్వామికి వేద పండితులు, అర్చకులు విశేష పూజలు చేశారు. ప్రతి గురువారం దేవస్థానం కైంకర్యంగా శ్రీ దత్తాత్రేయ స్వామికి ఈ ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
నిర్విఘ్నంగా ఈ పూజ కార్యక్రమం సాగేందుకు తొలుత మహా గణపతి పూజ చేశారు. అటుపై దత్తత్రేయ స్వామికి పంచామృతాభిషేకం, విశేష పూజలు చేశారు. లోకోద్దరణ కోసం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరలు ఒకే స్వరూపంలో దత్తాత్రేయుడిగా అవతరించారు. అందుకే త్రిమూర్తి స్వరూపుడిగా దత్తాత్రేయుడు ప్రసిద్ధుడు. కాగా, శ్రీశైల క్షేత్రానికి దత్తాత్రేయుల వారికి ఎంతో దగ్గరి సంబంధం ఉంది. ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం కింద దత్తాత్రేయ స్వామి తపస్సు చేశారని ప్రతీతి. అందుకే ఈ వృక్షానికి దత్తాత్రేయ వృక్షం అని పేరు.
కాగా, దత్తాత్రేయ స్వామి వారు కలియుగంలో గోదావరి నదీ తీరానా పీఠాపురంలో శ్రీపాద వల్లభునిగా జన్మించారు. వీరు ఒకసారి శ్రీశైల క్షేత్రంలోనే చాతుర్మాస వ్రతాన్ని ఆచరించినట్లు గురు చరిత్రలో పేర్కొన్నారు. కాగా, శ్రీ పాద వల్లబుడు తన శిష్యులకు ఆయా తీర్థ క్షేత్రాల మహిహా విశేషాలను వెల్లడించే సందర్భంలోనూ శ్రీశైలం గురించి పలుసార్లు వెల్లడించారు.
శ్రీపాద వల్లభుడి జన్మ తర్వాత మహారాష్ట్రలోని కరంజీ నగరంలో నృసింహా సరస్వతి స్వామిగా దత్తాత్రేయ స్వామి జన్మించారు. వీరు ఒకసారి మహాశివరాత్రి నాడు శ్రీశైల మల్లిఖార్జునుడిని సేవించినట్లు కూడా గురు చరిత్ర చెబుతున్నది. నృసింహ సరస్వతి వారు తమ అవతార సమాప్తిని శ్రీశైలంలోని పాతాళ గంగలోనే చేశారు. కలియుగ ప్రభావం రోజురోజుకు ఎక్కువ కావడంతో నృసింహ సరస్వతి స్వామి అద్రుశ్య రూపంలో ఉండి తన భక్తులను రక్షించాలని నిర్ణయించారు. దీంతో భౌతిక దేహాన్ని త్యజించేందుకు నలుగురు శిష్యులతో కలిసి శ్రీశైలానికి వచ్చారు.
శ్రీశైలంలోని కదలీవనం దగ్గర తమ శిష్యులు చూస్తుండగానే నృసింహ సరస్వతి స్వామి వారు అరటి ఆకులతో చేసిన ఒక ఆసనంపై కూర్చుని, కృష్ణా నదిలో ప్రవేశించి, కొంత దూరం ఆ ఆకులపైనే పయనిస్తూ అదృశ్యమైనట్లు గురు చరిత్ర చెబుతున్నది.