శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లకు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం గ్రామదేవత అంకాలమ్మకు అర్చకులు అభిషేకం, వార పూజలు చేశారు. సాయంత్ర శ్రీభ్రమరాంబ అమ్మవారికి ప్రీతికరమైన గులాబీ, దేవగన్నేరు, నందివర్ధనం, గరుడవర్ధనం, మల్లెలు, చామంతులతో పుష్పాలంకరణ చేసి ఊయలలో స్వామిఅమ్మవార్లను వేంచేబు చేసి సేవా మహా సంకల్పాన్ని పఠించారు. అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల, లలితా సహస్త్రనామాలతో షోడోపచార క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
శ్రీశైల మహాక్షేత్ర దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్నది. శుక్రవారం వేలాది మంది భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. ఉభయ దేవాలయాల్లో కైంకర్యాలు యథావిధిగా జరుగుతున్నట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. క్షేత్ర దర్శనానికి రావాలనుకునే భక్తులు srisailadevasthanam.org వెబ్సైట్లో ముందస్తుగా ఆర్జిత సేవా టిక్కెట్లు, దర్శనం టిక్కెట్లు, వసతి గదులను బుక్ చేసుకోవాలని సూచించారు.