Srisailam | శ్రీశైలం : లోక కల్యాణం కాంక్షిస్తూ శ్రీశైలం దేవస్థానంలోని పంచమఠాల్లో సోమవారం విశేష అభిషేకాలు, పుష్పార్చనలు చేశారు. ఘంటామఠం, భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధర మఠాల్లో పూజలు చేశారు. మొదట అర్చకులు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పం పఠించారు. దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలతో ఉండాలని సంకల్పం చెప్పి.. ఆ తర్వాత వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు.
ఆ తర్వాత అన్ని మఠాల్లో సంప్రదాయబద్దంగా అభిషేకాలు, అర్చనలు చేశారు. శ్రీశైల సంస్కృతిలో మఠాలు కీలకపాత్ర పోషించాయి. ఈ మఠాలు ప్రస్తుత సాధారణశకం 7వ శతాబ్దంలో నిర్మించగా.. గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం లాంటి నిర్మాణాలతో చూసేందుకు ఆలయాల తరహాలోనే కనిపిస్తాయి. కొన్ని శతాబ్దాల నుంచి కూడా ఈ మఠాలన్నీ క్షేత్ర ప్రశాంతతలోనూ, ఆలయ నిర్వహణలోనూ, ఆధ్యాత్మికపరంగా, భక్తులకు సదుపాయాలను కల్పించడంలో కీలపాత్ర పోషించారు. ఇప్పటికే పలు మఠాలు కాలగర్భంలో కలిసిపోగా.. ఆలయానికి దగ్గరలో ఉన్న ఈ మఠాలను దేవస్థానం కాపాడుతూ వస్తున్నది. కొన్నింటిని పునరుద్ధరించి.. ఈ మఠాలలోని దేవతామూర్తులకు నిత్యధూపదీపం, నివేదన, కైంకర్యాలు జరిపిస్తున్నది.