Fire Accident | అమరావతి : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాయవరంలోని గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ అగ్నికీలల్లో చిక్కుకుని ఆరుగురు సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వివిధ ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో 40 మంది కార్మికులు పని చేస్తున్నట్లు తెలిసింది. పేలుడు ధాటికి బాణాసంచా తయారీ కేంద్రం గోడ కుప్పకూలింది.
బాణసంచా పేలుడు ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలు, ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యలు, వైద్యసాయంపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
బ్రేకింగ్ న్యూస్
ఏపీలో బాణసంచా పరిశ్రమ పేలి ఆరుగురి మృతి
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
కోనసీమ జిల్లా రాయవరంలో భారీ అగ్ని ప్రమాదం
ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్న అధికారులు pic.twitter.com/yuPw7e11QW
— Telugu Scribe (@TeluguScribe) October 8, 2025