హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో స్థానిక పోలీసులతో కలిసి కూబింగ్ చేపట్టారు.
ఈ క్రమంలో ఇరుపక్షాలు తారసపడంతో పరస్పరం కాల్పులు జరుపుకొన్నారు. భద్రతా దళాల కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. ఆ ప్రాంతంలో ఇంకా కూంబింగ్ కొనసాగుతున్నదని అధికారులు వెల్లడించారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా, అతని సతీమణి హేమ ఉన్నారు. మరో అగ్రనేత ఆజాద్ కూడా మృతిచెందినట్లు తెలుస్తున్నది.
మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల సమయంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారని, వారిలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఉన్నారని స్పష్టం చేశారు. హిడ్మాపై రూ.కోటికిపైగా రివార్డు ఉండగా, ఆయన భార్య హేమపై రూ.50 లక్షలకుపైగా నగదు బహుమతి ఉన్నది.
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పూనర్తి గ్రామంలో హిడ్మా జన్మించారు. ఆయన అలసు పేరు మాద్వి హిడ్మా అలియాస్ సంతోశ్. 25 ఏండ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లారు. బస్తర్, దంతేవాడ ప్రాంత దళంలో కీలక సభ్యుడిగా ఎదిగారు. చిన్న వయస్సులోనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా అయ్యారు. గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా పేరొందిన హిడ్మా.. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) ప్లాటూన్-1 కమాండర్‌గా పనిచేశారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగానూ చేశారు. ఆయన మల్లా, నిషాద్ వర్గాలకు చెందిన వందలాది మందిని మావోయిస్టు పార్టీలో చేర్పించారు. వారికి సాయుధ శిక్షణ ఇచ్చి పీఎల్జీఏలో చేర్చి.. అభేద్యమైన సైన్యంగా తీర్చిదిద్దారు. గతంలో హిడ్మా నాయకత్వంలోనే భద్రతా బలగాలపై అనేక దాడులు జరిగాయని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న హిడ్మా.. చాలా సార్లు పోలీసులకు దొరికినట్టే దొరికి తప్పించుకున్నారు. అగ్రనేతలు సోనూ, ఆశన్నతోపాటు వందల మంది మావోయిస్టులు లొంగిపోయిన తర్వాత హిడ్మా లొంగుబాటు విషయంలో పెద్ద చర్చ జరుగుతున్నది. అనారోగ్య కారణాలతో ఆయన లొంగిపోనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఆయన కుమార్తె వంజెం కేషా అలియాస్ జిన్నీ ఈ ఏడాది ఫిబ్రవరిలో వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.