హైదరాబాద్: వైసీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) ఇంటివద్ద తీవ్ర ఉద్రక్తత కొనసాగుతున్నది. నకిలీ మద్యం కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. దీంతో జోగి రమేష్ ఇంటి వద్దకు వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు.
ఆయన ప్రోద్బలంతోనే మద్యం తయారు చేసినట్లు నకిలీ మద్యం కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న జనార్థనరావు స్టేట్మెంట్ ఇచ్చారు. దీని ఆధారంగా జోగి రమేశ్ ఇంటికి పోలీసులు వెళ్లినట్లు తెలుస్తున్నది. ఆయన అనుచరుడు రామును ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు భవానీపురం పీఎస్‌కు తరలించారు. దీంతో రమేశ్‌ను కూడా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం డంప్ కేసులో జోగి రమేష్‌పై టీడీపీ ప్రభుత్వం కేసు పెట్టింది. అయితే, నకిలీ మద్యం విషయంలో సీబీఐ విచారణ జరపాలని కోరుతూ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ వేసిన వెంటనే జోగి రమేష్ ఇంటికి భారీగా పోలీసులు చేరుకోవడం విశేషం.